భక్తుడి తరఫున సాక్ష్యం చెప్పిన భావనారాయణ స్వామి………

0
4
భక్తుడి తరఫున సాక్ష్యం చెప్పిన భావనారాయణ స్వామి………

పంచ భావనారాయణస్వామి క్షేత్రాలలో ‘పొన్నూరు’ ఒకటి. మిగతా నాలుగు క్షేత్రాలుగా ‘సర్పవరం’ .. ‘బాపట్ల’.. ‘భావదేవరపల్లి’ .. ‘పట్టసం’ కనిపిస్తాయి. ‘పొన్నూరు’లో వెలసిన స్వామి ‘సాక్షి’ భావనారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. పూర్వం కేశవశర్మ అనే బ్రాహ్మణుడు .. తనకి ఆడపిల్లపుడితే మేనల్లుడైన గోవిందశర్మకి ఇచ్చి వివాహం జరిపిస్తానని భావనారాయణ స్వామి సాక్షిగా మాట ఇస్తాడు. అప్పటికి గోవిందశర్మ చిన్న కుర్రాడిగానే ఉంటాడు. ఆ తరువాత కొంతకాలానికి కేశవ శర్మ దంపతులకు ఆడపిల్ల జన్మిస్తుంది. ఆ అమ్మాయికి యుక్త వయసురాగానే, వేరే సంబంధాలు చూస్తుంటాడు కేశవశర్మ. తనకి ఇచ్చి పెళ్లి చేస్తానని భావనారాయణ స్వామి సాక్షిగా మాట ఇచ్చిన విషయాన్ని గోవింద శర్మ గుర్తుచేస్తాడు. గోవింద శర్మకి పిల్లను ఇవ్వడం ఇష్టం లేని కేశవ శర్మ, తప్పించుకోవడం కోసం .. భావనారాయణ స్వామినే సాక్ష్యంగా తీసుకురమ్మని అంటాడు. దాంతో గోవింద శర్మ ఆ స్వామిని వేడుకొనగా, స్వయంగా స్వామియే వచ్చి సాక్ష్యమిచ్చాడు. అందువల్లనే ఇక్కడి భావనారాయణుడిని ‘సాక్షి’ భావనారాయణుడిగా భక్తులు పిలుచుకుంటూ వుంటారు .. కొలుచుకుంటూ వుంటారు.