ముల్లంగి పరాటా….

0
5
ముల్లంగి పరాటా….
తయారీకి కావల్సినవి:
  • గోధుమపిండి : 2 కప్పులు.
  • ముల్లంగి తురుము : కప్పు.
  • ముల్లంగి ఆకుల తరుగు : పావు కప్పు.
  • పచ్చిమిర్చి : 1 (తరగాలి).
  • గరం మసాలా : పావు టీ స్పూన్.
  • ధనియాలపొడి : టీ స్పూన్.
  • కారం : టీ స్పూన్.
  • పసుపు : పావు టీ స్పూన్.
  • నూనె : 3 టీ స్పూన్లు.
  • ఉప్పు : తగినంత.
సూచన: ముల్లంగి తరుగును గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఈ నీళ్లను పిండి కలపడానికి వాడచ్చు.
తయారు చేయు విధానం: ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, ఆకుల తరుగు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీనిని ఆరు భాగాలు చేసి, ముద్దలుగా చేసుకోవాలి. ఒకటిన్నర కప్పు పిండిలో 2 టీ స్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీంట్లో ముల్లంగి నీళ్లతో పాటు మరికొన్ని నీళ్లు కూడా కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్దను కవర్‌ చేసేలా పైన మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. మిగతా సగం కప్పు పిండి పరాటా చేయడానికి కోటింగ్‌లా ఉపయోగించాలి. మెత్తగా అయిన ముద్దను 6 భాగాలు తీసుకొని, చిన్న చిన్న ఉండలు చేయాలి. ఈ ఉండలను అరచేతి వెడల్పున ఒత్తి, మధ్యన ముల్లంగి ఉండ పెట్టాలి. చుట్టూ పిండితో రోల్‌ చేయాలి. (ఇది భక్ష్యం ఉండ మాదిరి చేయాలి) తర్వాత రొట్టెల పీట మీద ఒక్కో ఉండ పెట్టి, కాస్త మందం చపాతీ మాదిరి చేయాలి. పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధంగా ఉంచిన పరాటాలను వేసి, నూనె వేస్తూ రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చుకోవాలి. స్టఫ్డ్‌ ముల్లంగి పరాటా సిద్ధం. వీటికి వెన్న రాసి వేడి వేడిగా టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం.
                                                                                                               డెస్క్:లక్ష్మీ