ప్రణయ్‌ని మర్చిపో …లేదంటే…?

0
3
ప్రణయ్‌ని మర్చిపో …లేదంటే…? : అమృతకు ఆగని బెదిరింపులు

న్యూస్‌టుడె:ముఖ్యంశాలు….

  • ఇంటి వద్ద లెటర్‌ వదిలి వెళ్లిన ఆగంతకుడు
  • అందులో ఈ విధంగా హెచ్చరిక
  • మా కోడలిని మానసికంగా వేధించేందుకే అని అత్తమామల ఆవేదన

పరువు హత్యగా రెండు తెలు గు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య జరిగి ఇన్ని నెలలు గడిచిపోయినా అతని భార్య అమృతకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా ఈనెల 11వ తేదీన ప్రణయ్‌ వర్ధంతి రోజున గుర్తు తెలియని దుండగుడు అమృత ఇంట్లోకి ప్రవేశించి ఓ లేఖ వదిలి వెళ్లాడు. బైక్‌పై వచ్చిన ఈ ఆగంతకుడు లేఖ పెట్టినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ‘ఇప్పటికైనా ప్రణయ్‌ని మర్చిపో. లేదంటే…?’ అంటూ ఆ లేఖలో హెచ్చరిక ఉన్నట్లు అమృత తెలిపింది.నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళితుడైన పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్‌, అగ్రవర్ణ కుటుంబానికి చెందిన అమృత వర్షిణిలు పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. అమృత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించక పోవడంతో గత ఏడాది జనవరిలో వీరు హైదరాబాద్‌లోని ఆర్య సమాజ మందిరంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ప్రస్తుతం ఆ బిడ్డను చూసుకుంటూ అత్తవారింట్లోనే అమృత ఉంటోంది. ఇటువంటి సమయంలో బెదిరింపులపై అమృత అత్తమామలు ఆందోళన వ్యక్తం చేశారు. మా కోడలిని మానసికంగా హింసించేందుకే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేస్తున్నారని వాపోయారు. దీనిపై ప్రణయ్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.