ప్రియాంక గాంధీ భర్త రాబ‌ర్ట్ వాద్రా మనీ ల్యాండరింగ్, అక్రమాస్తులు…ఈడి 40 ప్రశ్నల వర్షం..

0
6
ప్రియాంక గాంధీ  భర్త రాబ‌ర్ట్ వాద్రా మనీ ల్యాండరింగ్, అక్రమాస్తులు…ఈడి 40 ప్రశ్నల వర్షం..

ఢిల్లీ: ఈడీ అధికారులు ఐదున్న‌ర గంటల పాటు వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన ఈడీ కార్యాలయానికి భార్య ప్రియాంక గాంధీతో పాటు చేరుకున్నారు. గురువారం ఉదయం వాద్రా మళ్లీ విచారణకు హాజరు అవుతున్నారని ఈడీ అధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్, అక్రమాస్తుల వ్యవహారంలో 40 ప్రశ్నలను సంధించి, రాతపూర్వక సమాధానాలు సేకరించారు. రాబర్ట్ వాద్రాను ఒక రూమ్ లో విచారించగా, మరో రూమ్ లో ఆయన అడ్వకేట్ ను కూర్చోబెట్టారు. ఈడీ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఐదుగురు ఇతర అధికారులు వాద్రాను ప్రశ్నించారు. ఆయన విచారణకు రావడం ఇదే తొలిసారి.

యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా విదేశాల్లో అక్రమాస్తుల కేసుకు సంబంధించి బుధవారం ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై వాద్రా ఓ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు రావడం విశేషం.

బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు తన న్యాయవాదులతో కలిసి వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదున్నర గంటలపాటు వాద్రాను విచారించిన అధికారులు, 40కి పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. గురువారం మళ్లీ విచారణకు రావాల్సిందిగా అధికారులు వాద్రాను ఆదేశించారు. అంతకుముందు వాద్రా మాట్లాడుతూ తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులూ లేవనీ, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందని త‌న వాద‌న వినిపించిన‌ట్టు తెలుస్తోంది.

రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారన్నారు వాద్రా. అక్రమాస్తుల కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిలు కావాలంటూ వాద్రా గతంలో ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించగా, ఈడీ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆయనకు సూచించింది. ఆర్థిక లావాదేవీలు, లండన్‌లో వాద్రా కొనుగోలు చేసిన, ఆయన అధీనంలో ఉన్న కొన్ని స్థిరాస్తులు తదితరాలపై వాద్రాను నగదు హవాలా నియంత్రణ చట్టం కింద విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి.

లండన్‌లోని 12, బ్య్రాన్‌స్టన్‌ స్క్వేర్‌లో 1.9 మిలియన్‌ పౌండ్లు ఖర్చు పెట్టి వాద్రా ఓ ఆస్తిని కొన్నాడనీ, ఇందుకు ఆర్థికంగా ఆయన అక్రమ మార్గాలను వాడినట్లు ప్రధాన ఆరోపణ. లండన్‌లో మరికొన్ని ఆస్తులను వాద్రా అక్రమంగా కలిగి ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. దీంట్లో భాగంగా రాబ‌ర్ట్ వాద్రా నుండి నిజాలు రాబ‌ట్టేందుకు ఈడి ఆయ‌న‌ను సుధీర్గంగా విచారిస్తోంది. ఐతే త‌న‌కు ఆస్తులు ఎక్క‌డ ఉన్నా నిజాయితీగా కూడ‌బెట్టిన‌వే అని వాద్రా త‌న వాద‌న‌ను వినిపిస్తుండ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here