రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి………

0
4
రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి………

నల్గొండ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీచేసిన కోమటిరెడ్డి.. ఈసారి ఢిల్లీ మీద కన్నేశారు. నల్గొండ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వెంకట్ రెడ్డి.. మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మరో ఐదేళ్లు ఖాళీగా ఉంటే ‘పట్టు’ తప్పుతుందని భావించడం కారణంగానే ఆయన ఢిల్లీపై కన్నేసినట్లు తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ తో గెలిచిన సర్పంచులను అభినందించారు వెంకట్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా పోటీచేస్తానంటూ ప్రకటించారు. తనను గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు. భువనగిరి లోక్‌సభ స్థానం అడిగినా కూడా పార్టీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుందని.. కాకపోతే నల్గొండ నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పనిలోపనిగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ప్రకటించే నిధులను పక్కదారి పట్టిస్తోందని ధ్వజమెత్తారు. గ్రామజ్యోతి పథకం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టినప్పటికీ.. నిధులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు.

యూత్ కాంగ్రెస్ లీడర్ గా ప్రస్థానం ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. 1999, 2004, 2009, 2014లో వరుసగా నల్గొండ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20 వేలకు పైగా ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో.. వన్ సైడ్ రిజల్ట్స్ రావడం ఆయనను ఆందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా బీపీ పెరగడంతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్గొండను కంచుకోటలా మార్చుకున్న వెంకట్ రెడ్డికి ఆ ఎన్నికల్లో ఓడిపోవడం పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఆ క్రమంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. 

1999 నుంచి 2014 వరకు వరుసగా నల్గొండ నుంచి ఎన్నికయిన వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే విషయంలో సఫలీకృతులయ్యారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు రాదనే ప్రచారంతో ఆయన వెంకట్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన రంగంలోకి దిగి ఢిల్లీ పెద్దలను ఒప్పించి చిరుమర్తికి టికెట్ కన్ఫామ్ చేయించారు. నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. ప్రజాప్రతినిధిగా ఉంటే తప్ప క్రీయాశీలక రాజకీయాల్లో రాణించలేమన్నది ఆయన అంతరంగం కావొచ్చు. అందుకే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారేమో. ఆయన తమ్ముడు ఇదివరకు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ఈసారి వెంకట్ రెడ్డి ఎంపీగా పోటీచేస్తే మాత్రం ఆయనకు ఇదే ఫస్ట్ టైమ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here