టీ20 క్రికెట్ చరిత్రలో రొమేనియా అరుదైన రికార్డు..12 ఏళ్ల నాటి రికార్డు బద్దలు!

0
6
టీ20 క్రికెట్ చరిత్రలో రొమేనియా అరుదైన రికార్డు..12 ఏళ్ల నాటి రికార్డు బద్దలు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • 173 పరుగుల భారీ తేడాతో టర్కీపై విజయం
  • 2007 నాటి శ్రీలంక రికార్డును తిరగరాసిన రొమేనియా
  • సెంచరీతో చెలరేగిన తమిళనాడు బ్యాట్స్‌మన్ శివకుమార్

టీ20 క్రికెట్ చరిత్రలో రొమేనియా అరుదైన రికార్డు సృష్టించింది. రొమేనియా కప్ 2019లో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచ్‌లో రొమేనియా 173 పరుగుల తేడాతో విజయం సాధించి సరికొత్త రికార్డు‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రొమేనియా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు శ్రీలంకపై ఉంది.2007లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును ఒక్క పరుగు తేడాతో రొమేనియా బద్దలుగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రొమేనియా ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. శివకుమార్ పెరియల్వార్ 40 బంతుల్లో 105 పరుగులతో చెలరేగాడు. లక్ష్య ఛేదనలో టర్కీ 13 ఓవర్లలో 53 పరుగులకే కుప్పకూలి భారీ ఓటమిని మూటగట్టుకుంది. తమిళనాడుకు చెందిన శివకుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. రొమేనియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. 31 ఏళ్ల శివకుమార్ తమిళనాడులో చదువుకుంటున్నప్పుడే వివిధ క్రికెట్ టోర్నమెంట్‌లలో ఆడాడు. రొమేనియా వెళ్లాక అక్కడి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. కాగా, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్టుగా రొమేనియా సరికొత్త చరిత్ర లిఖించగా, ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక (172), పాకిస్థాన్ (143), భారత్ (143), ఇంగ్లండ్ (137) జట్టు ఉన్నాయి.